: కెనడా ఎన్నికల్లో పంజాబీల సత్తా!
ఇటీవల కెనడాలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబ్ కు చెందిన ఎన్నారైలు సత్తా చాటారు. మొత్తం 19 మంది భారత సంతతి పోటీదారులు ఈ ఎన్నికల్లో విజయం సాధించగా, అందులో 18 మంది పంజాబ్ నుంచి కెనడా వెళ్లి స్థిరపడిన వారు ఉండటం గమనార్హం. గత ఎన్నికలతో పోలిస్తే కెనడా పార్లమెంటులో ప్రాతినిధ్యం పొందిన ఎన్నారైల సంఖ్య రెట్టింపైంది. ఈ ఎన్నికల్లో లిబరల్ పార్టీ నుంచి విజయం సాధించిన జస్టిన్ ట్రుడాయు ప్రధానిగా ఎంపికైన సంగతి తెలిసిందే. కెనడాలో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఓంటారియోలో భారతీయులు అధికంగా నివాసం ఉంటుండగా, ఈ ప్రాంతం నుంచి ఐదుగురు ప్రవాస భారతీయులు విజయం సాధించారు. వీరు ఐదుగురూ మహిళలే కావడం విశేషం. వీరిలో అంజూ ధిల్లాన్ కూడా ఉన్నారు. ఫ్రెంచ్ మాట్లాడేవారు అధికంగా ఉన్న క్యూబెక్ ప్రావిన్స్ నుంచి గెలిచిన తొలి ఇండో కెనడియన్ గా ఈమె చరిత్ర సృష్టించారు. ఈమెతో పాటు బ్రాంప్టన్ నార్త్ నుంచి రూబీ సహోతా కూడా గెలిచారు. కెనడాలోని మైనారిటీ వర్గాల్లో భారతీయుల శక్తి ఈ ఎన్నికల తరువాత మరింతగా పెరిగినట్లయిందని నిపుణులు వ్యాఖ్యానించారు.