: ప్రియుడు కట్నం అడిగాడని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
వారిద్దరూ చిన్ననాటి నుంచి కలసి చదివారు. ఉన్నత చదువులు పూర్తి చేసి ఒకే చోట ఉద్యోగాలు పొందారు. సంవత్సరాలుగా సాగిన తమ ప్రేమను పెళ్లి బంధంతో శాశ్వతం చేసుకోవాలని భావించారు. కానీ వరకట్న పిశాచి అడ్డుగా నిలిచింది. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి నేడు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామానికి చెందిన వెంకటేష్ ప్రసాద్, కోమలి ప్రేమించుకున్నారు. ఇద్దరికీ బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. వివాహం చేసుకోవాలనుకున్న సమయంలో ప్రసాద్ తల్లిదండ్రులు కట్నం కావాలని డిమాండ్ చేశారు. అందుకు ప్రసాద్ నుంచి కూడా కొంత ఒత్తిడి వచ్చింది. దీంతో బాధపడ్డ కోమలి, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన కూతురు ఇలా మరణించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.