: ఒళ్లంతా మట్టి పూసుకుని వైసీపీ కార్యకర్త నిరసన... మోదీ ‘మట్టి’ కొట్టారని ధ్వజం
ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంపై వైసీపీ వినూత్న నిరసనలకు తెర తీసింది. రాజధాని శంకుస్థాపనకు వస్తున్న మోదీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ప్రకటిస్తారన్న భావన వ్యక్తమైంది. అయితే నిన్నటి అమరావతి శంకుస్థాపనలో ఈ విషయంపై మోదీ నోరు మెదపలేదు. దీంతో వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు తెర తీసింది. ఇందులో భాగంగా విజయవాడలో ఆ పార్టీ నేతలు చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఓ కార్యకర్త ఒళ్లంతా మట్టి పూసుకుని వినూత్న నిరసనకు దిగాడు. ‘ఢిల్లీ నుంచి వస్తూ మట్టి, నీరు కాదు తేవాల్సింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందే’ అన్న నినాదాలున్న ప్లకార్డును ఆ కార్యకర్త పట్టుకున్నాడు, నిరసనలో భాగంగా వైసీపీ నేతలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు అడ్డుకునే లోపలే దిష్టిబొమ్మకు వైసీపీ నేతలు నిప్పంటించారు.