: ‘గల్లా’ నిరసన గళం... ప్రధాని ప్రసంగం నిరాశపరిచిందని కామెంట్!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన నరేంద్ర మోదీ దాదాపుగా అందరినీ నిరాశకు గురి చేశారు. ప్రత్యేక హోదాపై మోదీ నోట నుంచి ప్రకటన వస్తుందని ఆశించిన వారంతా, దానిపై ఆయన నోరు మెదపకపోవడంతో కంగుతిన్నారు. విపక్షాలు ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. ఇక అధికార టీడీపీకి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నిరసనకు దిగలేదు కానీ, నిరసన గళం మాత్రం వినిపించారు. కొద్దిసేపటి క్రితం గుంటూరులో మీడియాతో మాట్లాడిన గల్లా జయదేవ్, మోదీ ప్రసంగం తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని వ్యాఖ్యానించారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరిగా అవసరమేనని ఆయన వాదించారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రంలో ఎమోషనల్ ఇష్యూగా మారిపోయిందని చెప్పారు. ఇక కార్యక్రమ ఏర్పాట్లపైనా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమానికి పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్ ను పిలిచి వేదికపై కుర్చీలేసిన నేతలకు, స్థానిక సర్పంచ్, స్థానిక ప్రజా ప్రతినిధులు గుర్తుకు రాకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.