: మూడు రకాల ఆతిథ్యం... మహానాడులో క్యాటరర్స్ కే శంకుస్థాపన భోజన కాంట్రాక్టు
దాదాపు ఐదు నెలల క్రితం తెలుగుదేశం పార్టీ మహానాడులో సుమారు 2 లక్షల మందికి వండి వడ్డించిన క్యాటరింగ్ సంస్థకే అమరావతి శంకుస్థాపన నాడు అతిథులకు, భూములిచ్చిన రైతులకు, సాధారణ ప్రజలకు వండి వడ్డించే కాంట్రాక్టు లభించింది. అంబికా క్యాటరర్స్ సంస్థ ఈ రెండు కాంట్రాక్టులను దక్కించుకుంది. అమరావతిలో జరుగుతున్న భోజన ఏర్పాట్ల గురించి సంస్థ ప్రతినిధి శివాజీ వివరిస్తూ, "మొత్తం మూడు విభాగాల్లో భోజన ఏర్పాట్లను చేస్తున్నాం. ప్రతి ఒక్కరికీ పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, తాపేశ్వరం కాజా కామన్ గా ఉంటాయి. భూములిచ్చిన రైతులకు వీటితో పాటు అర లీటర్ నీళ్ల బాటిల్, మజ్జిగ ప్యాకెట్ అదనంగా ఉంటాయి. సాధారణ ప్రజలకు వీటితో పాటు రెండు వాటర్ ప్యాకెట్లను అందిస్తాం. ఇక వీఐపీలకు, వీవీఐపీలకు విడిగా వారికి నచ్చేలా వంటలను చేస్తున్నాం. ఉత్తరాది వంటకాలతో పాటు చైనీస్, అమెరికన్ వెరైటీలు అందిస్తున్నాం" అని తెలిపారు. మూడు విభాగాలుగా వంటలను విభజించామని, 400 మందికి పైగా వంటవారిని, 200 మంది ప్యాకింగ్ బాయిస్ ను ఏర్పాటు చేశామని వివరించారు. మొత్తం 1.60 లక్షల మందికి వంటలు వండిస్తున్నామని, 1.30 లక్షల ఫుడ్ ప్యాకెట్లను తయారు చేయిస్తామని శివాజీ తెలిపారు. రేపు సాయంత్రం నుంచి స్వీట్స్ తయారీ మొదలవుతుందని, ఆపై పులిహోర, దద్దోజనం తయారవుతాయని వెల్లడించారు. ఆహార పదార్ధాల నాణ్యత ఏమాత్రం చెడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలియజేశారు.