: తప్పిపోయిన బిడ్డను గంటల వ్యవధిలో తల్లి ఒడి చేర్చిన వాట్సాప్
సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్, తప్పిపోయిన తల్లీబిడ్డలను నిమిషాల వ్యవధిలో కలిపింది. ఈ ఘటన వరంగల్ జిల్లా కేసముద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, చిట్టె సునీత అనే మహిళ తన రెండేళ్ల కూతురు రచనతో కలసి కొత్త బట్టలు కొనేందుకు ఓ షాపుకు వెళ్లింది. తల్లి బట్టలు సెలక్ట్ చేయడంలో నిమగ్నం కాగా, పాప బయటకు వచ్చి దగ్గర్లోని రైల్వేస్టేషన్ వద్దకు నడుస్తూ వెళ్లిపోయింది. అక్కడ దిక్కుతోచని పాప ఏడుస్తూ ఉండగా, స్పందించిన ఓ ఆటో డ్రైవర్ పాప తల్లిదండ్రుల కోసం ఆచూకీ తీశాడు. ఎవరూ తమ పాపేనని ముందుకు రాలేదు. మరోవైపు షాపు వద్ద పాప కనిపించక ఆ తల్లి తల్లడిల్లుతున్న తీరు అందరినీ కలచివేసింది. ఆటో డ్రైవర్ నుంచి విషయం తెలుసుకున్న వెంకటేష్ అనే వ్యక్తి తన సెల్ నుంచి పాప ఫోటో తీసి, విషయాన్ని వివరిస్తూ, దాన్ని తన సెల్ ఫోన్ వాట్సాప్ లోని అన్ని కాంటాక్టు నంబర్లకూ పంపాడు. అక్కడి నుంచి నిమిషాల్లో కేసముద్రంలోని అన్ని స్మార్ట్ ఫోన్లకూ చేరిపోయింది. ఓ హోటల్ యజమాని బిడ్డ ఫోటో చూసి, తన హోటల్ ముందు పాప కనపించక ఏడుస్తూ వెతుకుతున్న తల్లికి చూపాడు. ఆ పాప తన బిడ్డేనంటూ తల్లి ఆనందంలో మునిగిపోయింది. మరికాసేపటికి బిడ్డ తల్లి ఒడికి చేరింది. తప్పిపోయిన తల్లీబిడ్డలను నిమిషాల్లో కలిపిన వాట్స్ యాప్ కు హ్యాట్సాఫ్ చెబుదాం!