: అమరావతి శంకుస్థాపనకు ‘నారావారిపల్లె’ ఆవు, దూడ
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఒక్క ఏపీ నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మట్టి, నీరు తరలివస్తున్నాయి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి కూడా మట్టి, నీరు చేరుకుంటున్నాయి. తాజాగా చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె నుంచి ఆవు, దూడ కూడా శంకుస్థాపనకు పయనమయ్యాయి. చిత్తూరు జిల్లాలో పాడి పరిశ్రమపై ఆధారపడి దాదాపు 4 లక్షల మంది రైతులు జీవనం సాగిస్తున్నారు. వీరందరికీ ప్రతినిధులుగా జిల్లాకు చెందిన చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె నుంచి ఆవు, దూడలను రాజధానికి పంపిస్తున్నట్లు నిన్న ఆ జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ ప్రకటించారు. నారావారిపల్లెలో నిన్న ఆవు, దూడలకు ప్రత్యేక పూజలు చేసిన అధికార యంత్రాంగం వాటిని ప్రత్యేక వాహనంలో అమరావతికి తరలించింది. ఏపీలోని 13 జిల్లాల నుంచి వచ్చిన మట్టితో ఈ ఆవు క్షీరం(పాలు), పంచితం (మూత్రం) కలిపి పునాదిరాయితో పాటు వేస్తారట.