: గుజరాత్ లో రెచ్చిపోతున్న పటేళ్లు... ఉద్ధృతమైన ఆందోళన!
తమ యువనేత హార్దిక్ పటేల్ ను భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ కి రానివ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని గుజరాత్ పటేల్ వర్గం యువకులు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఆయన్ను నిన్న అరెస్ట్ చేశారని తెలుసుకుని ఈ ఉదయం విధ్వంసానికి దిగారు. పలు ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు. మోర్బీ పట్టణంలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు ఓ బస్సును దగ్ధం చేశారు. పలు చోట్ల దుకాణాలపై రాళ్లు రువ్వారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ర్యాలీలు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పటేల్ యువతను అదుపు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హార్దిక్ పటేల్ ప్రకటించారు.