: పరిస్థితి విషమం... వెంటిలేటర్ పై కళ్లు చిదంబరం
సీనియర్ హాస్య నటుడు, తన కళ్లతోనే నవ్విస్తూ, వందలాది చిత్రాలలో సినీ ప్రేక్షకులను నవ్వించిన కళ్లు చిదంబరం అలియాస్ కొల్లూరు చిదంబరం ఆరోగ్యం మరింతగా విషమించినట్టు తెలుస్తోంది. ఆయన స్వయంగా ఊపిరి తీసుకోలేని స్థితిలో ఉన్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా, విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై ఉంచిన వైద్యులు కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్టు తెలియజేశారు. కాగా, ప్రముఖ చాయాగ్రహకుడు రఘు తన దర్శకత్వంలో 'కళ్లు' సినిమాను తలపెట్టినప్పుడు, అందులో పాత్రను పోషించాలని ప్రముఖ రంగస్థల దర్శకుడు ఎల్. సత్యానంద్ చిదంబరాన్ని కోరడం, ఆయన అంగీకరించడం జరిగాయి. ఆ సినిమాలో అద్భుత నటనకుగాను ఆయనకు నంది పురస్కారం, కళాసాగర్ పురస్కారం లభించాయి. అప్పటి నుంచీ తన తొలి సినిమానే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఆపై ఆయన వెనుదిరిగి చూడలేదు. దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. తన కళ్ళతో విచిత్రమైన హావభావాలను ప్రదర్శిస్తూ తనదైన హాస్యంతో ప్రేక్షకులలో చిదంబరం పేరుతెచ్చుకున్నారు.