: చంద్రబాబును ‘అన్నా’ అని సంబోధించిన కేసీఆర్... 50 నిమిషాల పాటు భేటీ


చాలా కాలం తర్వాత టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలుసుకున్నారు. అది కూడా కేసీఆర్ అధికారిక నివాసంలో. రాష్ట్ర విభజన తర్వాత ఎడమొగం, పెడమొగంలా వ్యవహరించిన వీరిద్దరూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో రెండు, మూడు సార్లు కలిసినా చిరునవ్వులు, షేక్ హ్యాండులు మినహా పెద్దగా మాట కలవలేదు. అయితే నిన్న నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ ను ఆహ్వానించేందుకు చంద్రబాబు నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్కడకు చేరుకోగానే తన కుమారుడు కేటీఆర్ తో కలిసి బయటకు వచ్చిన కేసీఆర్ కారు వద్దే చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. భేటీ ముగిసిన తర్వాత మళ్లీ కారు దాకా వచ్చి సాగనంపారు. దాదాపు 50 నిమిషాల పాటు సాగిన భేటీలో ఇద్దరు సీఎంలు కుశల ప్రశ్నలతో పాటు తమ తమ రాష్ట్రాలకు చెందిన విషయాలు, ఇతర రాష్ట్రాల పరిస్థితులు, ఇతర దేశాల గురించి చర్చించుకున్నారు. పనిలో పనిగా ఓ పది నిమిషాల పాటు ఏకాంతంగానూ చర్చించుకున్నారు. ఈ భేటీలో చంద్రబాబును ‘అన్నా’ అంటూ కేసీఆర్ మనసారా పిలిచారు. ఆహ్వాన పత్రిక అందించిన తర్వాత 'కార్యక్రమానికి వస్తున్నట్టేగా?' అని చంద్రబాబు అనగానే వెంటనే స్పందించిన కేసీఆర్ ‘‘అన్నా మీరొచ్చి పిలిచారు. తప్పకుండా వస్తాను’’ అని బదులిచ్చారు. ఇక ‘‘అమరావతికి ఎలా వస్తావు?... విమానంలోనా? హెలికాప్టర్ లోనా?’’ అని చంద్రబాబు అడగ్గానే ‘‘ఆ ముందు రోజు రాత్రి సూర్యాపేటలో ఉంటున్నాను. రోడ్డు మార్గం మీదుగానే వస్తా’ అంటూ కేసీఆర్ బదులిచ్చారు. ఇక భేటీ ముగిసిన తర్వాత ‘‘అమరావతికి వస్తున్నట్లు మీడియాకు నీవు చెబుతావా? నేను చెప్పాలా?’’ అని చంద్రబాబు సరదాగా ప్రశ్నించగా, ‘‘అన్నా, మీరే చెప్పండి’’ అని కేసీఆర్ బదులిచ్చారు.

  • Loading...

More Telugu News