: అమరావతి తాజా విశేషాలు!
నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసే శుభవేళ దగ్గర పడుతున్న కొద్దీ ఆ ప్రాంత ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ సంవత్సరం తాము చేసుకునే అన్ని పండగల కన్నా ఈ శంకుస్థాపన అతిపెద్దదని గుంటూరు, విజయవాడ మధ్య ఉన్న ప్రజలు చెబుతున్నారు. ఇక శంకుస్థాపన వేళ విజయవాడకు వచ్చే అతిథులను వేదిక వద్దకు తీసుకువెళ్లేందుకు నగర ప్రముఖులు తమ ఖరీదైన లగ్జరీ కార్లను ఇవ్వాలని ఎంపీ నాని చేసిన విజ్ఞప్తికి మంచి స్పందన లభించింది. పలువురు ప్రముఖులు తమ ఆడి, బెంజ్, జాగ్వార్ వంటి కార్లను ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఈ కార్లలో ప్రముఖులను ఉద్దండరాయుని పాలెం వరకూ తీసుకెళ్లి, తిరిగి వారిని ఎయిర్ పోర్టులకు చేరుస్తారు. శంకుస్థాపన ప్రాంతంలో మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా లేవని విమర్శలు వచ్చిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక సెల్ టవరును ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ సాయంత్రంలోగా సెల్ టవర్ నిర్మాణం పూర్తిచేస్తామని పేర్కొంది. ఉద్దండరాయునిపాలెంకు వచ్చే అన్ని మార్గాల్లోనూ పోలీసులు ఈ ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించారు. రోడ్ల మలుపుల వద్ద ట్రాఫిక్ జాంలు కాకుండా చూసేందుకు సైన్ బోర్డుల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం గ్రామస్థులకు నేడు ఆహ్వాన పత్రికలు అందాయి. ఏపీ మంత్రులు సునీత, మృణాళిని, నారాయణలు స్వయంగా వెళ్లి పట్టు వస్త్రాలు పంపిణీ చేసి భూములిచ్చిన రైతులను పేరుపేరునా ఆహ్వానించారు. ఇక శంకుస్థాపన ప్రాంతం ఇప్పుడు పర్యాటక శోభను సంతరించుకుంది. పండగ నాడు రద్దీ దృష్ట్యా అక్కడికి వెళ్లలేమని భావించే వారు, ఇప్పుడే వేదిక వద్దకు వచ్చి ఏర్పాట్లను చూసి వెళుతున్నారు. విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో వస్తున్నారు. యాగశాల, ప్రధాన వేదిక, ఇతర వేదికల వద్ద యువత సెల్ఫీలు తీసుకుంటూ సంబరపడుతోంది.