: అమరావతికి వెళ్లడానికి టీకాంగ్రెస్ నేతలు రెడీ... ఏపీ నేతలు మల్లగుల్లాలు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు హజరుకావాలంటూ ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలో, శంకుస్థాపనకు వెళ్లాలా? వద్దా? అనే విషయంపై ఇరు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొంతమంది అమరావతికి వెళ్లడానికి ఉత్సాహం చూపుతుంటే... ఏపీ కాంగ్రెస్ నేతలు మాత్రం అమరావతికి వెళ్లడానికి షరతులు పెడుతున్నారు. ఈ క్రమంలో, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేశారు. శంకుస్థాపనకు వెళుతున్నారా? అంటూ ఆరా తీశారు. దీంతో, ప్రధాని అపాయింట్ మెంట్ కోరామని... అది లభిస్తే వెళ్లాలనుకుంటున్నామని రఘువీరా సమాధానమిచ్చారు. మరోవైపు, ఏ నాయకుడికీ కూడా మోదీ అపాయింట్ మెంట్ దొరికే అవకాశమే లేదని విస్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో, కాంగ్రెస్ నేతలు శంకుస్థాపనకు హాజరవుతారా? లేదా? అనే విషయంలో సందేహం నెలకొంది. అమరావతికి వెళ్తే, హైదరాబాదులోని సీమాంధ్రులను ఆకట్టుకోవచ్చన్నది తెలంగాణ కాంగ్రెస్ నేతల భావన. అయితే, ఏపీ కాంగ్రెస్ నేతలు హజరుకాకపోతే తామెలా వెళ్లాలనే సందేహం వారిలో నెలకొంది.