: కిర్ స్టెన్... ఇంకోసారి ప్లీజ్!: బీసీసీఐ ఆఫర్ పై మాజీ కోచ్ అనాసక్తి


అప్పటిదాకా వరుస ఓటములతో దాదాపుగా కెరీర్ లోనే అత్యంత పేలవ ప్రదర్శనతో టీమిండియా సతమతమవుతోంది. అయితే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్ స్టెన్ అనూహ్య పరిణామాల నేపథ్యంలో జట్టు కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు. ఆ వెనువెంటనే జట్టు ప్రదర్శనపై దృష్టి సారించిన కిర్ స్టెన్, తొలుత ఆటగాళ్లలోని సత్తాను గుర్తించాడు. ఏ ఆటగాడు, ఏ విభాగంలో సమర్థవంతంగా రాణిస్తాడన్న అంశపై పూర్తి అవగాహన తెచ్చుకున్న కిర్ స్టెన్, త తర్వాత తన అమ్ముల పొదిలోని బాణాలు తీశాడు. టీమిండియాను విజయాల బాట పట్టించాడు. టెస్ట్ ర్యాంకింగ్స్ లో జట్టును అగ్రస్థానంలో నిలిపాడు. అప్పటిదాకా పింఛ్ హిట్టర్ గా పేరుగాంచిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీని కిర్ స్టెన్ పరిపూర్ణ కెప్టెన్ గా తీర్చిదిద్దాడు. తర్వాత ఏకంగా జట్టుకు ప్రపంచ కప్ నే అందించాడు. కాంట్రాక్టు ముగిసింది. కిర్ స్టెన్ దక్షిణాఫ్రికా వెళ్లిపోయాడు. అతడి ప్లేస్ లో డంకన్ ప్లెచర్ వచ్చాడు. టీమిండియా మళ్లీ ప్రాభవం కోల్పోతోంది. డంకన్ పదవీ కాలం కూడా ముగిసింది. దాదాపు ఏడాదిగా టీమిండియా కోచ్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ నుంచి కిర్ స్టెన్ కు రెండు, మూడు పర్యాయాలు ఫోన్లు వెళ్లాయి. ‘‘మరోమారు కోచ్ పదవి చేపట్టండి’’ అంటూ బీసీసీఐ చేసిన అభ్యర్థనకు కిర్ స్టెన్ స్పందించలేకపోయాడు. అవునని గానీ, కాదని గానీ చెప్పలేకపోయాడు. ఈ విషయాలను అతడే స్వయంగా వెల్లడించాడు. ‘‘ఛాయ్ టీ అండ్ జింజర్ బీర్’ పేరిట కిర్ స్టెన్ భార్య డెబోరా ఓ పుస్తకం రాశారు. ఈ పుస్తకావిష్కరణ కోసం నిన్న భార్యతో కలిసి ముంబై వచ్చిన సందర్భంగా కిర్ స్టెన్ ఈ విషయాన్ని తెలిపాడు. ‘‘బీసీసీఐ ప్రతిపాదనకు సమాధానం చెప్పేందుకు చాలా కష్టంగా అనిపించింది’’ అని కిర్ స్టెన్ చెప్పాడు.

  • Loading...

More Telugu News