: టీమిండియా అత్యుత్తమ కెప్టెన్ ధోనీ... కెప్టెన్ కూల్ కు మాజీ కోచ్ మద్దతు


కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ లది మంచి జోడీ. వీరిద్దరి హయాంలోనే టీమిండియా టెస్టు ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. అంతేకాదు, సుదీర్ఘ విరామం తర్వాత 2011 ప్రపంచ కప్ ను టీమిండియా సగర్వంగా ఒడిసిపట్టింది. ప్రపంచ కప్ తర్వాత కాంట్రాక్టు కాల పరిమితి ముగియడంతో కిర్ స్టెన్ తన బాధ్యతల నుంచి తప్పుకోగా, ధోనీ మాత్రం ఇంకా కెప్టెన్సీ బాధ్యతలను మోస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవల టీమిండియా వరుస ఓటముల నేపథ్యంలో కెప్టెన్ కూల్ పై విమర్శలు పెరుగుతున్నాయి. వీటిపై నిన్న కిర్ స్టెన్ విరుచుకుపడ్డాడు. ధోనీకి అండగా నిలబడ్డాడు. ‘‘ధోనీ క్రికెట్ నుంచి ఎందుకు తప్పుకోవాలి? ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలోనే కాక సమర్థులైన నాయకుల్లో అతడు ఒకడు. అలాంటి ఆటగాడిని తప్పుకోవాలంటూ వాదించడంలో అర్థం లేదు. ధోనీ స్థానాన్ని ఎవరైనా భర్తీ చేయగలరా? కోహ్లీ వచ్చేది మూడో స్థానంలో. ధోనీ సగటు 52.66. ప్రపంచ క్రికెట్ లో ఇది అత్యుత్తమం. అందుకే దిగిపొమ్మంటున్నారా? టీమిండియా అత్యుత్తమ కెప్టెన్ గా ధోనీ చరిత్రలో నిలిచిపోతాడు. అతడి ప్రదర్శనలే ఇందుకు నిదర్శనం. వేరే ఆటగాళ్ల పట్ల కూడా విమర్శకులు ఇలాగే వ్యవహరిస్తారా? సచిన్ విషయంలోనూ ఇలాగే చేసేవారా? నాకైతే ఇది చాలా అన్యాయమనిపిస్తోంది’’ అని ధోనీ విమర్శకులపై కిర్ స్టెన్ విరుచుకుపడ్డాడు.

  • Loading...

More Telugu News