: అంపైర్ పై అనుచిత వ్యాఖ్యలు... టీమిండియా మేనేజర్ కు జరిమానా
మైదానంలో అంపైర్ల నిర్ణయాలపై ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటనలు మనకు తెలిసిందే. అయితే మైదానం వెలుపల జట్టు బాగోగులు చూసుకునేందుకు వెళ్లే మేనేజర్ కు ఆటతో అంతగా పెద్ద పనేమీ ఉండదు. ఆటగాళ్ల వసతి, భోజన సౌకర్యాలతో పాటు ఫ్లైట్ టికెట్లు, ప్రయాణ ఏర్పాట్లు తదితరాలను చూసేందుకు జట్టు వెంట ఓ మేనేజర్ ఉంటాడు. ఆటతో సదరు పదవిలో ఉండే వ్యక్తికి అంతగా సంబంధం ఉండదు. అయితే టీమిండియా జట్టు మేనేజర్ వినోద్ ఫడ్కే మాత్రం హద్దులు దాటాడు. ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా మొన్న జరిగిన వన్డేకు సంబంధించి అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయంపై ఫడ్కే నోరు పారేసుకున్నాడు. తటస్థంగా ఉండే అంపైర్లపై ఆటగాళ్లే కాదు, ఎవరు నిందలు వేసినా సహించేది లేదన్న ఐసీసీ, ఫడ్కేకు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తాను హద్దు మీరలేదన్న ఫడ్కే వాదనను కొట్టిపారేసిన ఐసీసీ, ఆయన మ్యాచ్ ఫీజులో 40 శాతాన్ని కోత పెట్టింది.