: నేను తప్పు చేస్తే కత్తులు దూయాలని చూశారు: ధోనీ
తనను విమర్శిస్తున్న వారికి బ్యాటుతోనే సమాధానం చెప్పి వరుస పరాజయాల తరువాత భారత్ ను గెలుపు దారిలోకి నెట్టిన భారత జట్టు వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ లో తాను తప్పులు చేస్తే కత్తులు దూయాలని చూశారని ఆయన వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికాతో రెండో మ్యాచ్ లో జట్టు ప్రదర్శన తనకు అంతగా సంతృప్తిని ఇవ్వనప్పటికీ, మొత్తం మీద మ్యాచ్ గెలవడం ఆనందాన్ని కలిగించిందని తెలిపాడు. చివరి ఓవర్లలో సింగిల్స్ తీయరాదని తాను ముందే నిర్ణయించుకున్నానని, సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని భావించే ఆ పని చేశానని ధోనీ వివరించాడు. "ఈ మ్యాచ్ అంత సులభమేమీ కాదు. చాలా మంది మేము తప్పులు చేస్తే, ఆపై ఆడుకోవాలని భావిస్తూ, కత్తులు దూయడానికి సిద్ధంగా ఉన్నారు" అని అన్నాడు. నిన్నటి మ్యాచ్ లో ధోనీ 86 బంతుల్లో 92 పరుగులు చేసి జట్టును గౌరవ ప్రదమైన స్థితిలో నిలిపిన సంగతి తెలిసిందే.