: పప్పు పోయి కోడి వచ్చే ఢాంఢాంఢాం!


"ఉప్పులేని కూర... పప్పులేని విందు" ఇది ఓ నానుడి. ఇప్పుడు మాత్రం పప్పన్నం తినడం కన్నా కోడి కూడా తినడం చౌకని ప్రజలు అభిప్రాయపడాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్, పాట్నా, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో కందిపప్పు ధరలు ఆకాశానికి అంటగా, కందిపప్పుతో పోలిస్తే చికెన్ ఎంతో తక్కువకు లభిస్తోంది. హైదరాబాద్ లో పప్పు స్థానంలో కోడిగుడ్డు భోజనంలోకి వచ్చి చేరగా, బీహార్ లో ప్రజలు పప్పన్నాన్నే మరచి పోయారు. అన్నంతో పాటు పచ్చళ్లు తినాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. ఇక ఢిల్లీ విషయానికి వస్తే, కందిపప్పు ధర కిలోకు రూ. 180కి చేరింది. చెన్నై, హైదరాబాద్ నగరాల్లోనూ ఇదే పరిస్థితి. ఇక చికెన్ ధర కిలోకు రూ. 120 నుంచి 130 మధ్య ఉంది. అంటే పప్పుతో పోలిస్తే రూ. 50 నుంచి రూ. 60 తక్కువకు చికెన్ లభిస్తోంది. "కిలో కందిపప్పు ధర రూ. 140 ఉన్నప్పుడు 'దాల్-చావల్'ను రూ. 40కి అమ్మేవాళ్లం. ఇప్పుడు రూ. 50 తీసుకోవాల్సి వస్తోంది" అని హైదరాబాద్, హైటెక్ సిటీ ప్రాంతంలో రహదారి పక్కనే ఓ చిన్న హోటల్ నిర్వహిస్తున్న శ్రీగాయత్రి వెల్లడించింది. ధరలు పెంచడంతో అమ్మకాలు తగ్గాయని వాపోయింది. ఇదే సమయంలో ఒక ప్లేట్ చికెన్ ను రూ. 20కే అమ్ముతుండటంతో, ప్రజలు సైతం 'దాల్చా-చావల్' బదులు చికెన్ తినడానికి ముందుకొస్తున్నారని వెల్లడించింది. ఇదే సమయంలో కోడి గుడ్ల ధర ఒక్కింటికి రూ. 4 వద్ద ఉంది. దీంతో నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంట్లో సైతం రూ. 30తో ఓ కూర చేసుకుని తినే సౌలభ్యం దగ్గరైంది. ఈ సంవత్సరం మార్చిలో వచ్చిన అకాల వర్షాల కారణంగా వివిధ రకాల పప్పు ధాన్యాల పంటలు తీవ్రంగా నష్టపోగా, ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్క కందిపప్పు మాత్రమే కాదు, మినపప్పు, పెసర పప్పు, శనగలు వంటి అన్నింటి ధరలూ మూడంకెల సంఖ్యను దాటిపోయాయి. "కందిపప్పు ధర అతి త్వరలో డబుల్ సెంచరీ కొడుతుందని భావిస్తున్నాను" అని హైదరాబాద్ వ్యవసాయ నిపుణుడు అశోక్ గులాటీ వ్యాఖ్యానించారు. రోజుకు రూ. 100 సంపాదిస్తున్న కుటుంబాలకు పప్పు ఏనాడో దూరమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సీజన్ పంట చేతికి వచ్చేదాకా ఇదే పరిస్థితి తప్పకపోవచ్చని అంచనా. అందుకే పేదలతో పాటు, దిగువ మధ్య తరగతి ప్రజల భోజనాల్లోకి పప్పు స్థానంలో కోడి వచ్చి చేరింది.

  • Loading...

More Telugu News