: బ్యాంకులకు తలసాని బంధువుల టోకరా... ఆస్తుల జప్తునకు ఆదేశాలు
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమార్తె శ్వేత, ఆయన సమీప బంధువులు ఒకే ఆస్తిని పలు బ్యాంకుల వద్ద తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారట. అంతేకాక పలు ఆర్థిక సంస్థల వద్ద తనఖా పెట్టిన సదరు ఆస్తిని విక్రయించి సొమ్ము చేసుకునేందుకు యత్నించారట. విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. బాధిత సంస్థల ఫిర్యాదుతో కోర్టు ఆ ఆస్తుల జప్తునకు నిన్న ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకెళితే... తలసాని కుమార్తె శ్వేత, సమీప బంధువులు ప్రభాకర్, రాజు, వెంకటేశ్, ముత్యాలు యాదవ్, తలసాని మిత్రుడు వెంకట్ రెడ్డి 2008లో ‘మై ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట ఓ రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలం చెంగిచెర్ల గ్రామ పరిధిలోని ఫ్లాట్ నెంబర్ జీ3, 1, 23, 45, 102, 103, 137, 201, 202, 203లను తనఖా పెట్టి డీహెచ్ఎఫ్ఎల్ వైశ్యా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి రూ.1.50 కోట్ల మేర రుణం తీసుకున్నారు. కొంతకాలం పాటు ఆ సంస్థకు రుణ వాయిదాలు చెల్లించిన మై ఇన్ ఫ్రా ఆ తర్వాత వాయిదాలు చెల్లింపును నిలిపేసింది. దీంతో సదరు బ్యాంకు మై ఇన్ ఫ్రాకు పలుమార్లు నోటీసులు జారీ చేసిన స్పందనా లభించలేదు. ఈ తతంగం జరుగుతుండగానే మై ఇన్ ఫ్రా అదే సర్వే నెంబర్లను తనఖా పెట్టి మరిన్ని బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుందట. దీనిని వైశ్యా ఫైనాన్స్ లిమిటెడ్ అధికారులు గుర్తించారు. పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించి రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో తనఖా పెట్టిన ఆస్తులను బ్యాంకు అధికారులు నిన్న స్వాధీనం చేసుకున్నారు.