: ‘అమరావతి’ యాంకర్ సాయి కుమార్... డ్రమ్స్ తో అలరించనున్న శివమణి
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రముఖ నటుడు సాయి కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు నిన్న మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ అయిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. కార్యక్రమాన్ని మరచిపోలేనంతగా నిర్వహించేందుకు అసరమైన ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ప్రధాని సహా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్న ఈ కార్యక్రమానికి సాయి కుమార్ యాంకరింగ్ అయితేనే బాగుంటుందన్న భావనతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక కార్యక్రమానికి ముందు భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆహూతులను అలరించనున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ వాద్య కళాకారుడు ‘డ్రమ్స్’ శివమణి తన డ్రమ్స్ తో సభా ప్రాంగణాన్ని హోరెత్తించనున్నాడు. కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి.