: భారతీయుల ఉదారత్వానికి ఎనలేని ధన్యవాదాలు చెబుతున్న పాకిస్థాన్ తల్లి


ఓ వైపు శివసేన కార్యకర్తలు పాకిస్థాన్ పై మరింత పగను చూపుతున్న వేళ, ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ చికిత్స నిమిత్తం ఇండియాకు వచ్చిన ఓ బాలిక వైద్యానికి అవసరమైన లక్షలాది రూపాయలను దానమిచ్చిన భారతీయుల ఉదార గుణానికి నిదర్శనం ఈ కథ. మరిన్ని వివరాల్లోకి వెళితే, కరాచీలో ఉన్న 15 ఏళ్ల బాలిక సబా తారిఖ్ అహ్మద్ 'విల్సన్ డిసీజ్' అనే వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం తన తల్లి నజియాతో కలసి ముంబై వచ్చింది. ఈ వ్యాధి అత్యంత అరుదుగా సోకుతుంది. శరీరంలో కాపర్ స్థాయి మరింతగా పెరిగి, రక్తంలో విషంగా మారి ప్రాణాలను హరిస్తుంది. దీనికి చికిత్స చేయాలంటే లక్షల రూపాయలు వెచ్చించాలి. అంత డబ్బు ఆమె తల్లి వద్ద లేవు. విషయం తెలుసుకున్న 'బ్లూబెల్స్ కమ్యూనిటీ' అనే ఎన్జీవో సంస్థ స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో సబా గురించిన వివరాలు వెల్లడిస్తూ, ధన సహాయం కోరడంతో పాటు సంస్థలో సభ్యులుగా ఉన్న ముంబై వాసుల నుంచి రూ. 7 లక్షలు సమీకరించింది. విషయం తెలుసుకున్న వందలాది మంది తమకు తోచినంత దానం చేయగా, మొత్తం రూ. 13 లక్షల నిధి ఏర్పడింది. దీంతో చికిత్స పూర్తయి పూర్తి ఆరోగ్యవంతురాలిగా సబా కరాచీ బయలుదేరిందని ఆమెకు చికిత్స చేసిన జస్ లోక్ ఆసుపత్రి సీఈఓ డాక్టర్ తరణ్ జ్ఞాన్ చందానీ వెల్లడించారు. ఇప్పడు నజియా భారతీయుల ఉదార గుణానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతోంది.

  • Loading...

More Telugu News