: పోస్టు మార్టం చేసే వైద్యులనే అతను భయపెట్టాడు!
పోస్టు మార్టం చేసే వైద్యులు చాలా ధైర్యంగా ఉంటారు. అలాంటి వైద్యులను బెంబేలెత్తించాడో వ్యక్తి. ముంబైలోని సులోచనశెట్టి మార్గ్ లో ఉన్న బస్టాప్ వద్ద ఓ వ్యక్తి (42) అపస్మారకస్థితిలో పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతనిని పరిశీలించిన పోలీసులు, చికిత్స నిమిత్తం లోకమాన్య తిలక్ ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన ఆ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ రోహన్ రోహేకర్ అతను మృతి చెందాడని నిర్ధారించారు. రికార్డుల్లో కూడా అతను మృత్యువాతపడినట్టు చేర్చారు. దీంతో పోస్టు మార్టం నిమిత్తం అతనిని మార్చురీకి తరలించారు. కాసేపట్లో పోస్ట్ మార్టంకు వైద్యులు సిద్ధమవుతుండగా, టేబిల్ పై ఉన్న అతను లేచి కూర్చున్నాడు. దీంతో వైద్యులు బెంబేలెత్తిపోయారు. తీరా చూస్తే అతను మరణించలేదని నిర్ధారణ అయింది. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యాన్ని అంతా ఎండగడుతున్నారు.