: ఇది హడావుడి కాదు...ఇలా చేయడానికి ఇన్ని కారణాలున్నాయి!: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేయడం అవసరమా? అని చాలా మంది ప్రశ్నించే అవకాశం ఉందని, ఇలా చేయడానికి కారణమేంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు భవిష్యత్తులో ఏదైనా రాజధానిని చూసి, 'తమ రాజధాని ఇలా లేదే అని బాధపడకూడదనే ఆలోచనే' అని ఆయన చెప్పారు. 'సింగపూర్ వైశాల్యంలో ఏపీ కంటే చాలా చిన్నది. అయితే, అందులోనే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకుని, అభివృద్ధి చెంది, ఎక్కువ జీడీపీ సాధించింది' అని ఆయన అన్నారు. అలాంటి పట్టణం అనుభవాలు కొత్త రాజధానికి అవసరమని ఆయన చెప్పారు. అలాగే జపాన్ పూర్తిగా అభివృద్ధి చెందిన దేశమని, అక్కడ పెట్టుబడులకు అవసరమైన డబ్బులున్నాయని ఆయన చెప్పారు. 'వారు పెట్టుబడులు ఎక్కడ పెట్టాలా? అని ఆలోచిస్తున్నారు. అందుకే వారిని ఇందులో భాగం చేశా'మని బాబు అన్నారు. మన రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు రావాలంటే ఇలాంటి వాళ్లు మనతో పనిచేయాలని ఆయన తెలిపారు. అలాగే అంతర్జాతీయ కంపెనీలు రావాలంటే మార్కెటింగ్ చేసుకుని తీరాలని, ఆ మార్కెటింగ్ కు అవకాశం ఉండడంతో పారిశ్రామిక వేత్తలను, వివిధ దేశాల అంబాసిడర్లను పిలుస్తున్నామని ఆయన చెప్పారు. ఎన్నారైలు, మన దేశంలో పారిశ్రామిక వేత్తలకు మన విధానాలు తెలిసేలా చేయడం కోసం వారిని కూడా పిలుస్తున్నామని ఆయన చెప్పారు. మీటింగ్ ను వీలైనంత తక్కువ ఖర్చులో చేయడానికి ప్రయత్నిస్తున్నామని, అదే సమయంలో రాజధానిని మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నామని, అందుకే ఈ స్థాయి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.