: రిటైల్, ఏవియేషన్, ఈ-కామర్స్ కంపెనీలను అయస్కాంతంలా ఆకర్షిస్తున్న తెలంగాణ!
తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమే అయినప్పటికీ, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు మాత్రం అపారమైన అవకాశాలు అందించే ఆకర్షణీయ రాష్ట్రంగా నిలుస్తోంది. పక్కనున్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు వచ్చి పరిశ్రమలను స్థాపిస్తున్న కంపెనీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఈ-కామర్స్, రిటైల్, ఏవియేషన్ రంగాల్లోని పలు కంపెనీలను ఓ అయస్కాంతంలా ఆకర్షించడంలో తెలంగాణ విజయం సాధిస్తోంది. గడచిన సంవత్సరం వ్యవధిలో పలు కంపెనీలు తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభించాయి. ఈ-కామర్స్ దిగ్గజం అమజాన్ అతిపెద్ద ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్ ను ఇప్పటికే ప్రారంభించింది. మరో సెంటర్ ను ప్రారంభించే సన్నాహాల్లో ఉంది. ఇదే రంగంలోని మరో సంస్థ ఫ్లిప్ కార్ట్ భారీ గోదామును హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించుకుంది. స్వీడన్ కేంద్రంగా ఫర్నీచర్ తయారు చేస్తున్న సంస్థ ఐకేఈఏ హైదరాబాద్ సమీపంలో ప్లాంటు కోసం 13 ఎకరాలను కొనుగోలు చేసింది. ఇక ఏవియేషన్ విషయానికి వస్తే బోయింగ్ సంస్థ టాటా గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకుని రక్షణ రంగ ఉత్పత్తుల పరిశ్రమను స్థాపించి భారీ పెట్టుబడులతో తెలంగాణలోకి ప్రవేశించింది. "మేము పరిశ్రమలకు 100 శాతం పారదర్శకతతో సేవలందిస్తున్నాం. అందువల్లే కంపెనీలు తెలంగాణ రాష్ట్రం పట్ల ఆసక్తిని చూపుతున్నాయి. కేవలం 15 రోజుల్లో పరిశ్రమలకు కావాల్సిన అన్ని అనుమతులూ ఇస్తున్నాం" అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. మిగులు ప్రభుత్వ భూమిని వ్యాపార సంస్థలకు విక్రయించడం, పన్ను విధానం సరళతరంగా ఉండటం తమ విజయ రహస్యమని ఆయన తెలిపారు. ఉత్పత్తి రంగానికి ఊతమివ్వడంలో తెలంగాణ ముందుందని సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) చైర్ పర్సన్ దాట్ల వనిత వ్యాఖ్యానించారు. త్వరలోనే దక్షిణాదిన అతిపెద్ద, ప్రధాన వ్యాపార కేంద్రంగా తెలంగాణ అవతరించనున్నదని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, తెలంగాణలో విలువ ఆధారిత పన్నుల నుంచి కొత్త పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వాలని పలు సంస్థలు కోరుతున్నాయి. అమ్మకందారుల నుంచి వ్యాట్ వసూలు నిలిపితే మరిన్ని కంపెనీలు రావడానికి అవకాశాలు ఉంటాయని నిపుణులు సైతం సలహాలు ఇస్తున్నారు. కర్ణాటక కోల్పోతున్న అవకాశాలను రాష్ట్రం దక్కించుకోవాలంటే సాధ్యమైనంత త్వరలో వ్యాట్ పై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ దిశగా కేసీఆర్ సర్కారు ఎటువంటి అడుగు వేస్తుందో వేచి చూడాల్సిందే.