: దానం నాగేందర్, అంజన్ కుమార్ అరెస్ట్
టీకాంగ్రెస్ నేతలైన మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపు తెలంగాణ వ్యాప్తంగా విపక్షాలు చేపట్టనున్న బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ, హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన దానం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి అంజన్ కుమార్ తో పాటు భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అయితే, ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో, ఆగ్రహించిన కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, దానం, అంజన్ లను అదుపులోకి తీసుకుని కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ర్యాలీ సందర్భంగా, ట్రాఫిక్ కు భారీ అంతరాయం ఏర్పడింది.