: ఫ్యాక్షన్ ఖిల్లాలో నేడు ఏపీ హోం మంత్రి పర్యటన
కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టులు, హత్యలకు నిలయంగా మారి ఫ్యాక్షన్ ఖిల్లాగా పేరుపడ్డ కర్నూలు జిల్లాలోని కుగ్రామం ‘కప్పట్రాళ్ల’కు నేడు ఏపీ హోం శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వెళ్లనున్నారు. నిన్న సాయంత్రానికే కర్నూలు చేరుకున్న ఆయన రాత్రి అక్కడే బస చేశారు. మరికాసేపట్లో ఆయన కప్పట్రాళ్ల వెళ్లనున్నారు. ఫ్యాక్షన్ హత్యలతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఆ గ్రామాన్ని జిల్లా ఎస్పీ రవికృష్ణ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు శాఖల నుంచి ఆ గ్రామానికి నిధులు విడుదల చేయిస్తున్న రవికృష్ణ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో పాఠశాలకు కొత్త భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని నేడు మరో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో కలిసి చినరాజప్ప ప్రారంభించనున్నారు. ఫ్యాక్షన్ ఖిల్లాలో హోం మంత్రి పర్యటన ఆసక్తి రేపుతోంది.