: 13 ఏళ్లకు పెళ్లి, 14 ఏళ్లకు కవలలు, కట్ చేస్తే... ఐదేళ్ల తరువాత ఆమె ఎందరికో ఆదర్శం!


హర్యానా రాష్ట్రంలోని రోహ్ తక్ లోని ఓ కుస్తీ శిక్షణా కేంద్రం. ఎప్పుడు వెళ్లినా ఓ 19 ఏళ్ల యువతి కఠోశ శిక్షణ తీసుకుంటూ కనిపిస్తుంది. అమె వెనకున్న కథ మాత్రం ఎంతమాత్రమూ ఊహించలేనిది. ఆమె పేరు నీతూ. అంతర్జాతీయ కుస్తీ పోటీల్లో ఇండియా తరఫున పాల్గొని ఎన్నో పతకాలు సాధించి మరెందరికో ఆదర్శంగా నిలిచింది. ఆమెలా తయారు కావాలని ఎంతో మంది మహిళలు ఇప్పుడు కలలు కంటున్నారు. 1995లో భివానీలో జన్మించిన నీతూకు 13 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. మరో సంవత్సరం గడిచేసరికి కవలలు పుట్టారు. చాలీచాలని సంపాదనతో కుటుంబం గడిచేది కాదు. "నా భర్త నిరుద్యోగి. మా అత్తకు కొంత పెన్షన్ వస్తుంటే, అది పిల్లల చదువులు, ఇల్లు గడిచేందుకే సరిపోదు. పూర్తి సంప్రదాయ కుటుంబం మాది. నాకు కుస్తీ పోటీలంటే ఎంతో ఇష్టం. కానీ ఇంట్లోనివారికి అది ఎంతమాత్రమూ నచ్చేది కాదు. నా బరువు 80 కిలోలు. నిత్యమూ అర్ధరాత్రి 3 గంటలకు లేచి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ, గ్రామం నిద్రలేవకముందే ఇల్లు చేరేదాన్ని" అని చెప్పే నీతూ, జాతీయ స్థాయిలో జూనియర్, సీనియర్ పోటీలతో పాటు గత సంవత్సరం జరిగిన వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ పోటీల్లోనూ సత్తా చాటింది. "ఆమె ఒక్క క్షణం కూడా వృథా చేయదు. శిక్షణలో భాగంగా ఎంతో శ్రమిస్తుంది. మరిన్ని పతకాలు సాధించే సత్తా ఆమెకుంది" అని నీతూ కోచ్ మన్ దీప్ సింగ్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయి రెజ్లర్ అయినప్పటికీ, ఆమె ఇద్దరు బిడ్డల తల్లి. ఆమెది ఇప్పటికీ పేద కుటుంబమే. నలుగురికీ ఆదర్శంగా నిలిచే ఇటువంటి ఆటగాళ్లను ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • Loading...

More Telugu News