: కనీవినీ ఎరుగని రీతిలో అమరావతి శంకుస్థాపన... ఖర్చు రూ. 300 కోట్లు!


అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమాన్ని 'నభూతో నభవిష్యతి' అన్న రీతిలో జరపాలని భావిస్తున్న చంద్రబాబు సర్కారు ఖర్చు విషయంలో ఎంత మాత్రమూ రాజీ పడటం లేదు. మిగతా రాష్ట్రాలు, ఆహ్వానితులు ఆశ్చర్యపోయేలా ఈ కార్యక్రమాన్ని మునుపెన్నడూ లేని రీతిలో ఘనంగా నిర్వహించాలని భావిస్తున్న సర్కారు అందుకోసం రూ. 300 కోట్లకు పైగానే వెచ్చిస్తున్నట్టు తెలుస్తోంది. రహదారుల ఏర్పాటు, వాటి విస్తరణ, పొలాలను చదును చేసేందుకే రూ. 80 కోట్ల వరకూ వెచ్చిస్తున్నట్టు తెలుస్తోంది. అత్యవసరం, యుద్ధ ప్రాతిపదికన అంటూ, ప్రతి పనినీ నామినేషనల్ పద్ధతులపై అప్పగిస్తూ, శరవేగంగా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నది. వీలైనన్ని విమానాలు, హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది. దాదాపు 250 ఎకరాల్లో చలువ పందిళ్లను వేయాలని ఆదేశించింది. ఈ ఏర్పాట్లన్నీ తాత్కాలికమే. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 10 లక్షల మందిని సమీకరించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్న బాబు ప్రభుత్వం, ఈ కార్యక్రమాన్ని నిర్వహించే సంస్థకు ఫీజు రూపంలో రూ. 10 కోట్లు చెల్లించనున్నట్టు తెలుస్తోంది. నేషనల్ హైవే నుంచి తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయుని పాలెం గ్రామానికి నాలుగు రహదారులను అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తూ, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో పనులు మొత్తం పూర్తయ్యేలా రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. విజయవాడలోని అన్ని ప్రధాన రహదారుల విద్యుద్దీకరణ, అక్కడి నుంచి రాజధాని ప్రాంతాలకు తరలే రహదారుల సుందరీకరణకు రూ. 20 కోట్లు ఖర్చవుతోంది. దీంతో పాటు దేశ విదేశీ ప్రముఖులకు బస, వారి రాకపోకలు, వారిని సులువుగా అమరావతికి చేర్చేందుకు సాధ్యమైనన్ని హెలికాప్టర్లను అద్దెలకు తీసుకోనుంది. మొత్తం 9 రోజుల పాటు ఉత్సవాలు జరగనుండగా, ప్రధాన కార్యక్రమం దసరా నాడు జరగనున్న సంగతి తెలిసిందే. విమానాశ్రయాల అద్దెలు, స్పెషల్ విమానాలు, హెలికాప్టర్ల కోసం రూ. 100 కోట్లు వ్యయం కానుందని అధికారులు చెబుతున్నారు. వేదిక సమీపంలో హెలికాప్టర్ల రాకపోకలకు అనువుగా 15 హెలీపాడ్లను కూడా నిర్మిస్తున్నారు. వీటిల్లో వీవీఐపీల కోసం మూడు, మిగతా వారి కోసం 12 హెలీపాడ్లను వినియోగించనున్నట్టు తెలుస్తోంది. ఇవి కాకుండా ఇతర అవసరాలు, కనీసం 22వ తేదీన 10 లక్షల మంది ప్రజలకు భోజనం, అతిథులకు తొమ్మిది రోజుల కోసం వంటకాలు తదితరాలకు రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా. దీంతో మొత్తం ఖర్చు రూ. 300 కోట్లను దాటుతుందని భావిస్తుండగా, లోటు బడ్జెట్ తో ఉద్యోగుల జీతాలకే ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇంత ఘనంగా వేడుకలు అవసరమా? అని విమర్శిస్తున్న వారూ లేకపోలేదు.

  • Loading...

More Telugu News