: కరవు మండలాలను ప్రకటించకపోవడానికి కూడా గత ప్రభుత్వాలే కారణమా?: కేసీఆర్ పై నాగం సెటైర్
ప్రతి సమస్యను గత ప్రభుత్వాలకు, పాలకులకు అంటగడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నారని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. గత పాలకుల వల్లే కరవు వచ్చిందని ఆరోపించిన కేసీఆర్... కరవు మండలాలను ప్రకటించకపోవడానికి కూడా గత పాలకులే కారణమని చెబుతారా? అని ఎద్దేవా చేశారు. రాజకీయాలు చేయడం ప్రభుత్వం మానుకోవాలని... రైతులకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. రైతు ఆత్మహత్యలను నివారించకపోతే ప్రభుత్వం విఫలమైనట్టే అని చెప్పారు. రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ నరసింహన్ ను కలిసి నాగం ఫిర్యాదు చేశారు.