: జమ్మూకశ్మీర్ లో మరోసారి మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
జమ్మూకశ్మీర్ లో మరోసారి మొబైల్ ఇంటర్నెట్ సేవలు స్తంభించాయి. బీఫ్ వివాదం నేపథ్యంలో సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారన్న అనుమానాలతో నెట్ సేవలను ఇవాళ మధ్యాహ్నం నిలిపివేశారు. జమ్మూకశ్మీర్ లో బీఫ్ అమ్మకంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన నిషేధ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు రెండు నెలల పాటు స్టే విధించింది. ఈ క్రమంలో ఓ స్వతంత్ర ఎమ్మెల్యే బీఫ్ పార్టీ ఇచ్చినట్టు నేడు తెలియడంతో ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆయనపై దాడి చేశారు. దాంతో సోషల్ మీడియాలో ఈ సంఘటన మరింత ప్రచారమై గొడవలకు దారితీసే పరిస్థితి ఏర్పడుతుందన్న కారణంతోనే నెట్ సేవలు నిలిపివేశారని సమాచారం.