: జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేపై బీజేపీ సభ్యుల దాడి... కారణమేంటంటే...!
జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ కొద్దిసేపటి క్రితం రణరంగాన్ని తలపించింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్ పై అధికార కూటమిలోని బీజేపీ సభ్యులు మూకుమ్మడి దాడి చేశారు. కొంత మంది బీజేపీ ఎమ్మెల్యేలు రషీద్ ను లాగి ఒంగోబెడితే, మరికొందరు ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. ఊహించని ఘటనతో వెనువెంటనే అప్రమత్తమైన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ సభ్యులు రషీద్ కు మద్దతుగా దూసుకెళ్లారు. దీంతో సభలో ఒక్కసారిగా యుద్ధవాతావరణం నెలకొంది. తోపులాట మధ్యే సభ్యులు ఎలాగోలా శాంతించారు. అయితే ఉన్నపళంగా ఈ ఘటన జరగడానికి కారణమేంటంటే... నిన్న ఆ రాష్ట్ర రాజధాని శ్రీనగర్ లోని ఎమ్మెల్యేల హాస్టల్ లో రషీద్ కొందరికి ‘బీఫ్ పార్టీ’ ఇచ్చారట. అంతటితో ఆగని ఆయన గోమాంసం నిషేధంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోమాంసంపై నిషేధం అమలు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఇటీవలే ఆదేశించింది. ఈ క్రమంలో నిన్న ‘బీఫ్ పార్టీ’ ఇచ్చిన రషీద్, ‘‘ప్రజలు ఏం తినాలో, ఏం తినకూడదో నిర్ణయించే అధికారం ప్రభుత్వానికే కాక కోర్టులకూ లేదు. తాము తినాలనుకున్న దాని తినకుండా ప్రజలను ఎవరూ అడ్డుకోలేరు’’ అని వ్యాఖ్యానించారట. దీనిపై పక్కా సమాచారం తెలుసుకున్న మీదటే బీజేపీ ఎమ్మెల్యేలు రషీద్ పై అసెంబ్లీ సాక్షిగా దాడికి దిగారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించి వీడియో క్లిప్పింగ్ లు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.