: ప్రజలను తప్పుదారి పట్టించేందుకే జగన్ దీక్ష చేస్తున్నారు: పురందేశ్వరి
ప్రత్యేక హోదాకై దీక్ష చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేందుకే జగన్ దీక్ష చేపట్టారని ఆరోపించారు. ప్రత్యేక హోదా అనే పదం లేకున్నా ఏపీని కేంద్రం తప్పకుండా ఆదుకుంటుందని ఆమె పునరుద్ఘాటించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల శిక్షణ శిబిరంలో పురందేశ్వరి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని వ్యాఖ్యానించారు. సమయానికి నివేదిక పంపించకపోవడం వల్లే నిధుల విడుదలలో ఆలస్యమైందని తెలిపారు.