: టీఆర్ఎస్ ‘మాధవరెడ్డి’ మీరేనటగా!... మీడియా ప్రశ్నకు విస్తుపోయిన టీఎస్ మంత్రి
ఉమ్మడి రాష్ట్రంలో హోం మంత్రి పదవిలో ఉండగానే నక్సల్స్ తూటాలకు బలైపోయిన టీడీపీ సీనియర్ నేత ఎలిమినేటి మాధవరెడ్డి ప్రస్తావనతో నిన్న తెలంగాణ మంత్రి ఒకరు బెంబేలెత్తిపోయారు. నిన్నటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, కొందరు మీడియా ప్రతినిధుల మధ్య లాబీల్లో ఆసక్తికర చర్చ జరిగింది. సభ నుంచి బయటకు వచ్చిన మంత్రిని లాబీల్లో చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి ప్రశ్నలు సంధించారు. ‘‘మంత్రివర్గంలో మార్పులు చేపడుతున్నారట. మీకు హోం మంత్రి పదవి ఇవ్వబోతున్నారట కదా? నల్గొండ జిల్లాకు చెందిన నేతకే హోం శాఖ ఇవ్వాలని సీఎం భావిస్తున్నారట. ఇక మీరు మాధవరెడ్డి (మాజీ హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి) కాబోతున్నారు’’ అన్న మీడియా ప్రతినిధుల మాటలు విన్న జగదీశ్ రెడ్డి వేగంగా స్పందించారట. నక్సల్స్ దాడిలో మృతి చెందిన మాధవరెడ్డి అంశం స్ఫురించేలా ‘‘అంటే నన్ను మాధవరెడ్డిని చేస్తున్నారా?’’ అని మంత్రి సరదాగా బదులిచ్చారు.