: కేంద్ర కేబినెట్ ఈరోజు తీసుకున్న కీలక నిర్ణయాలు
ఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో, రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో 12.5 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఇక దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఎయిమ్స్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.4,949 కోట్లతో ఏపీలోని మంగళగిరి, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ లో ఎయిమ్స్ లను నిర్మించాలని నిర్ణయించారు. రూ.2,142 కోట్లతో నీరాంచల్ పేరుతో జాతీయ నీటి సరఫరా ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతేగాక రూ.500 కోట్లతో ఇండియాగేట్ వద్ద జాతీయ యుద్ధ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వార్ మ్యూజియం ఏర్పాటుకు కూడా అంగీకారం తెలిపింది. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన కింద 9 రాష్ట్రాల్లో వాటర్ షెడ్ల నిర్మాణానికి రూ.2442 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణలోనూ వాటర్ షెడ్లు నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.1072 కోట్లు రుణం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.