: ‘దుష్ట’ నేతలకు దూరంగా ఉండండి... దేశ ప్రజలకు కేజ్రీ వీడియో మెసేజ్
గోమాంసం వండాడన్న ఆరోపణలతో హత్యకు గురైన ముస్లిం సోదరుడు అఖ్లాక్ ఘటనతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ తరహా హింసాత్మక ఘటనలపై నరేంద్ర మోదీ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ఇప్పటికే ఇద్దరు సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతలు తమ పురస్కారాలను వాపస్ చేశారు. అయితే ఇప్పటికే దాద్రికి వెళ్లి అఖ్లాక్ కుటుంబాన్ని పరామర్శించి వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనదైన శైలిలో దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. ‘‘దుష్ట రాజకీయ నేతలకు దూరంగా ఉండండి’’ అని ఆయన దేశ ప్రజలకు ఓ వీడియో సందేశాన్ని పంపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేశారు. సదరు వీడియోను వీక్షించడంతో పాటు వీలయినంత మందికి దానిని షేర్ చెయ్యాలని పిలుపునిచ్చారు. ట్విట్టర్ లో కేజ్రీవాల్ పెట్టిన వీడియోలో కేవలం ఓ కొవ్వొత్తి మాత్రమే కనిపిస్తున్నా, కేజ్రీ వాయిస్ మాత్రం దేశ ప్రజలను అప్రమత్తం చేస్తోంది.