: సీఆర్ డీఏ అధికారులతో చంద్రబాబు సమావేశం... శంకుస్థాపన ఏర్పాట్లపై సమీక్ష
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సీఆర్ డీఏ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో, శంకుస్థాపన భద్రతా ఏర్పాట్ల గురించి చర్చిస్తున్నారు. మంత్రులు నారాయణ, దేవినేని ఉమ, ప్రత్తిపాటి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 1500 మంది వీవీఐపీలకు ఆహ్వానాలు పంపే బాధ్యతను గుంటూరు జిల్లా కలెక్టర్ కు, రిసెప్షన్ కమిటీ బాధ్యతలు కృష్ణా జిల్లా కలెక్టర్ కు అప్పగించారు. మరికొంతమంది వీవీఐపీలకు ఆహ్వాన పత్రాలను వ్యక్తిగతంగా ఇచ్చేందుకు 200 మంది అధికారులను ఎంపిక చేయనున్నారు. జాతీయ, అంతర్జాతీయ మీడియాను ఆహ్వానించే బాధ్యత ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ కు అప్పగించారు. భూమిలిచ్చిన రైతులకు పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ ఆహ్వాన పత్రాన్ని రెవెన్యూ అధికారులు వ్యక్తిగతంగా అందించాలని సమావేశంలో తీర్మానించారు.