: 'బుల్' పరుగో పరుగు... రూ. 54 వేల కోట్ల లాభం!
భారత స్టాక్ మార్కెట్ బుల్ పరుగు ఆగలేదు. ఆసియా మార్కెట్ల సరళితో సెషన్ ఆరంభంలో నమోదైన లాభాలు, ఆపై మధ్యాహ్నానికి కాస్తంత తగ్గినా, చివరి గంటన్నర వ్యవధిలో వచ్చిన కొనుగోలు మద్దతు ఇన్వెస్టర్ల సంపద రూ. 54 వేల కోట్లు పెరిగేలా చేసింది. మంగళవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 147.33 పాయింట్లు పెరిగి 0.55 శాతం లాభంతో 26,932.88 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక 33.60 పాయింట్లు పెరిగి 0.41 శాతం లాభంతో 8,152.90 పాయింట్ల వద్దకు చేరాయి. సోమవారం నాటి సెషన్లో రూ. 98,39,357 కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్, రూ. 98,93,996 కోట్లకు పెరిగింది. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.31 శాతం, స్మాల్ క్యాప్ 0.69 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో టాటా మోటార్స్, ఐటీసీ, సిప్లా, కోల్ ఇండయా, గెయిల్ తదితర కంపెనీల ఈక్విటీలు లాభపడ్డాయి. ఇదే సమయంలో బీహెచ్ఈఎల్, ఇన్ఫోసిస్, అల్ట్రా సిమెంట్స్, ఏసీసీ, ఎన్టీపీసీ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. తదుపరి సెషన్లలో సైతం సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల బాటలో పయనించవచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.