: నా మనవడు మాస్క్ వేసుకుని తిరుగుతున్నాడు: చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు
దేశ రాజధానిలో నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యంపై చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాలుష్యంపై విచారణ జరుగుతుండగా, తనతో పాటు తన మనవడు సైతం కాలుష్య భూతం దెబ్బకు బాధితులుగా మారామని తెలిపారు. "నా మనవడు మాస్క్ వేసుకుని తిరుగుతున్నాడు" అని దత్తు వ్యాఖ్యానించగా, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మాట్లాడుతూ, తన జీవితంలో తొలిసారిగా స్టెరాయిడ్లను తీసుకోవాల్సి వచ్చిందని, కాలుష్యం తన ఆరోగ్యాన్ని నాశనం చేసిందని తెలిపారు. రెండు రోజుల క్రితం తన భార్య, కుమార్తె ఆస్తమాతో బాధపడుతూ వైద్యం చేయించుకున్నారని సాల్వే తెలిపారు. "ఈ కేసులో వాదోపవాదాలను మీడియా పత్రికలు, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇదో సీరియస్ కేసు. విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నాం. ప్రభుత్వం నుంచి సరైన స్పందన కోరుతున్నాం" అని దత్తు సహా జస్టిస్ అరుణ్ మిశ్రా, ఆదర్ష్ కుమార్ గోయల్ లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.