: అతి పెద్ద గిడ్డంగి కోసం తెలంగాణకు తరలిరానున్న ఫ్లిప్ కార్ట్!
బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, తమ అతిపెద్ద గిడ్డంగిని తెలంగాణలో నిర్మించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 1.2 లక్షల వస్తు ఉత్పత్తులను డెలివరీ నిమిత్తం పంపగలిగే సామర్థ్యంతో ఉండే ఈ వేర్ హౌస్ పూర్తి ఆటోమేషన్ విధానంలో పనిచేస్తుందని, ప్రత్యక్షంగా 2 వేల మందికి, పరోక్షంగా 10 వేల నుంచి 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిన్నీ బన్సాల్ వెల్లడించారు. "లొకేషన్ కేంద్రం ఎంపికలో కర్ణాటకను ఎంచుకోవాలని తొలుత భావించా. అయితే, ఇక్కడ ఈ-కామర్స్ విభాగంలో ఉన్న నియంత్రణ విషయంలో స్పష్టత లేదు. అందువల్లే ఇక్కడ గిడ్డంగులు ఏర్పాటు చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. కర్ణాటకలో వద్దనుకుంటే తెలంగాణకు వెళ్తాం. అక్కడి నుంచి దక్షిణాదిలోని అన్ని ప్రాంతాలకూ మంచి కనెక్టివిటీ ఉంది. కస్టమర్లకూ దగ్గరౌతాం. ప్రస్తుతం మా కస్టమర్లలో 70 శాతం మంది దక్షిణ భారత రాష్ట్రాల్లోని వారే" అని ఆయన అన్నారు. కాగా, గతంలో తమకు విలువ ఆధారిత పన్ను (వ్యాట్) నుంచి మినహాయింపు ఇస్తే కర్ణాటకకు వస్తామని అమేజాన్ వెల్లడించగా, అందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సైతం అదే కోరుతోంది. దీనికి అంగీకరించే పరిస్థితి కనిపించకపోవడంతో తెలంగాణలో ఫ్లిప్ కార్ట్ గిడ్డంగి ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ సంస్థ 15 చిన్న గిడ్డంగులను వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తుండగా, అందులో మూడు కర్ణాటకలో ఉన్నాయి.