: హోటల్ లోకి పరుగు పెట్టినా వదల్లేదు... వ్యాపారిని వెంటబడి హతమార్చిన పాతబస్తీ రౌడీలు


నిన్న హైదరాబాదులోని బాలాపూర్ లో పాతబస్తీ రౌడీ షీటర్ల కుటుంబాలకు చెందిన ముగ్గురు యువకుల మధ్య కత్తి ఫైటింగ్ జరిగింది. అంతకు సరిగ్గా గంట ముందు లక్డీకాపూల్ లో మరో పాతబస్తీ రౌడీల మూక దారుణ హత్యకు ఒడిగట్టింది. గిల్ట్ నగల వ్యాపారిని వెంటాడి, ఇనుప రాడ్లతో దాడి చేసి హతమార్చింది. హోటల్ లోని సీసీ కెమెరాల్లో రికార్డైన ఈ ఘటన దృశ్యాలు హైదరాబాదులో కలకలం రేపుతున్నాయి. ప్రాణభయంతో హోటల్ లోకి పరుగులు పెట్టిన వ్యాపారిని రౌడీలు అత్యంత దారుణంగా హతమార్చారు. జనం చూస్తుండగా, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా, తెలంగాణ డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ ఘటన జరగడం విశేషం. పోలీసులంటే ఏమాత్రం భయం లేని ఇద్దరు రౌడీలు వ్యాపారిని హతమార్చి ఎంచక్కా అక్కడనుంచి వెళ్లిపోయారు. వివరాల్లోకెళితే... గిల్ట్ నగల వ్యాపారం చేస్తున్న సోహైల్ ను డబ్బుల కోసం పాతబస్తీకి చెందిన ఇద్దరు రౌడీలు వేధించారట. వీరి ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సోహైల్ సైఫాబాదు పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రౌడీలనిద్దరినీ పోలీస్ స్టేషన్ కు పిలిచిన పోలీసులు వారిని హెచ్చరించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన సోహైల్ ఇంటికెళ్లేందుకు సిద్ధపడుతుండగానే రౌడీలిద్దరూ అతడిపై దాడికి యత్నించారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు లక్డీకాపూల్ రైల్వే స్టేషన్ మీదుగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను దాటి అక్కడి హోటల్ సంధ్య లోకి పరుగెత్తాడు. అతడిని వెంబడిస్తూ హోటల్ లోకి చొరబడ్డ ఇద్దరు రౌడీలు అతడిని హోటల్ లోనే దారుణంగా హతమర్చారు. వీడియో ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు రౌడీల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News