: ఆయనను చేర్చుకుంటే నేనెళ్లిపోతా!... నారా లోకేశ్, బాలయ్యలకు తేల్చిచెప్పిన మాజీ మంత్రి
కడప జిల్లా రాజకీయాల్లో వేడి రాజుకుంది. ‘తోకలాంటి ఎమ్మెల్యే పదవిని త్వరలోనే కత్తిరించుకుంటాను’ అంటూ వైసీపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన సంచలన ప్రకటన అటు వైసీపీలోనే కాక, ఇటు టీడీపీలోనూ అగ్గి రాజేసింది. జమ్మలమడుగుకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి నిన్న పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో పాటు హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆధినారాయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకునే విషయంపై నిరసన వ్యక్తం చేశారు. ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి చేర్చుకుంటే తాను పార్టీని వీడతాననని కూడా రామసుబ్బారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. ఆదినారాయణరెడ్డి కారణంగా టీడీపీకి చెందిన 150 మంది కార్యకర్తలు చనిపోయారని, అలాంటి వ్యక్తిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని కూడా ఆయన లోకేశ్, బాలయ్యలను నిలదీసినట్లు సమాచారం. అయితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా నుంచి ఆయన పార్టీ నేతలు వస్తే, మనకే మంచిది కదా? అంటూ వారిద్దరూ రామసుబ్బారెడ్డికి సర్దిచెప్పే యత్నం చేశారట. దీంతో ఒకింత అసహనానికి గురైన రామసుబ్బారెడ్డి... ఆదినారాయణరెడ్డి పార్టీలోకి వస్తే, తాను బయటకు వెళ్లిపోతానంటూ తేల్చిచెప్పారట.