: దశాబ్దాలపాటు మధురానుభూతిని అందించిన కంపెనీ లాకౌట్!
ఎన్నో వెరైటీల చాక్లెట్లతో దశాబ్దాల పాటు మధురానుభూతిని అందించిన ప్రముఖ సంస్థ 'న్యూట్రిన్' చిత్తూరు ప్లాంట్ మూతపడబోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీని ఎంత మాత్రం నడపలేమని యాజమాన్యం స్పష్టం చేసింది. 1952లో చిత్తూరులో ప్రారంభమైన ఈ సంస్థ ప్రపంచస్థాయి గుర్తింపును పొందింది. అంతర్జాతీయ స్థాయి సంస్థలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో, అనతి కాలంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగింది. వార్షిక టర్నోవర్ రూ. 1,500 కోట్లకు చేరుకుని సత్తాచాటిన న్యూట్రిన్, ఆ తర్వాత కాలంలో క్రమంగా ప్రాభవం కోల్పోతూ వచ్చింది. కంపెనీ యాజమాన్యం అనేక సార్లు మారడం సంస్థను దిగజార్చింది. దీంతో, భారీ లాభాల్లో ఉన్న న్యూట్రిన్ నష్టాల్లోకి జారుకుని, చివరకు లాకౌట్ దశకు చేరుకుంది. ఒకప్పుడు ఈ సంస్థలో 3వేల మంది పనిచేసేవారు. కంపెనీ యాజమాన్యం నిర్ణయంతో కార్మికులంతా తమ ఉపాధిని కోల్పోనున్నారు. నాణ్యమైన, రుచికరమైన చాక్లెట్లను అందించిన న్యూట్రిన్, చివరకు లాకౌట్ దశకు చేరుకోవడం బాధించే అంశమే.