: మనవడితో గడపాలని నాకూ ఉంటుంది!...కానీ సమయం ఉండట్లేదు: చంద్రబాబు వ్యాఖ్య
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నోటి వెంట నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు వెలువడ్డాయి. తన మనవడిని గుర్తు చేసుకున్న చంద్రబాబు, అతడితో కాసేపు గడుపుదామంటే సమయం చిక్కడం లేదని ఒకింత బాధ పడ్డారు. అయితే తన కుటుంబానికి మించి కార్యకర్తలే తనకు మిన్న అని పేర్కొన్న ఆయన తనను తాను సమర్థించుకున్నారు. నిన్న విజయవాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అధికారంలోకి వచ్చాక నా బాధ్యత మరింత పెరిగింది. భార్యతో మాట్లాడే సమయం కూడా ఉండటం లేదు. అయినా, ఆమె అర్థం చేసుకుని అన్నీ తానే చూసుకుంటుంది. నా మనవడిని చూడటానికి కూడా వెళ్లడం లేదు. అందరిలాగే నాకూ వాడితో కాసేపు గడపాలని ఉంటుంది. కానీ, సమయం ఉండదు. అయినా వీటన్నింటినీ మించి కార్యకర్తలే నాకు ప్రాణం. తొలి ప్రాధాన్యం వారికే’’ అని ఆయన చెప్పుకొచ్చారు.