: అక్టోబర్ 2న ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ ప్రసాదం పంపిణీ
హైదరాబాదులోని ఖైరతాబాద్ మహాగణపతి లడ్డూ ప్రసాదాన్ని అక్టోబర్ 2న భక్తులకు పంపిణీ చేయనున్నట్టు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి పంచిపెడతామని తెలిపారు. తొలుత ఈ నెల 30వ తేదీన (అంటే నేడు) ప్రసాదం పంపిణీ చేస్తామని కమిటీ సభ్యులు చెప్పారు. ప్రసాదం పంపిణీ సమయంలో పోలీసు బందోబస్తు తప్పనిసరి. కానీ పోలీసులు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలకు భద్రత కల్పిస్తుండటంతో ప్రసాదం పంపిణీ తేదీని మార్చారు. కాబట్టి ముప్పైయవ తేదీన భక్తులు రావద్దని సూచించారు. కాకినాడకు చెందిన సురుచి ఫుడ్స్ వారు ఈసారి ఆరువేల కిలోల లడ్డూను గణేశుడికి ప్రసాదంగా అందజేశారు. 11 రోజుల పాటు గణపతి చేతిలో పూజలందుకుంది. కాగా లడ్డూను కవర్ తో పూర్తిగా కప్పి ఉంచడంవల్ల వల్ల గాలి తగలక పాడైపోయే అవకాశం ఉందని దాత మల్లిబాబు తెలిపారు. వీలైనంత త్వరలో భక్తులకు పంచాలని కోరుతున్నారు.