: హోంమంత్రి నాయినిపై షబ్బీర్ అలీ ఎదురుదాడి
రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ శాసనమండలి దద్దరిల్లింది. రైతుల సమస్యలపై చర్చ సందర్భంగా, అధికార, విపక్ష సభ్యుల మధ్య హాట్ హాట్ గా చర్చ జరిగింది. మండలిలో కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ, రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని అన్నారు. మిగతా విషయాల్లో మాత్రం చివరి స్థానంలో నిలిచిందని ఎద్దేవా చేశారు. రైతు ఆత్మహత్యలపై లెజిస్లేచర్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కల్పించుకుని, తాము అధికారంలోకి వచ్చి 16 నెలలే అయిందని అన్నారు. నాయిని వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ భగ్గుమన్నారు. 16 నెలల సమయం అంటే, చిన్న సమయం కాదని మండిపడ్డారు. 16 నెలల్లో ఏమీ చేయలేకపోతే, ఇంకెందుకు పరిపాలిస్తున్నారని ఎదురుదాడి చేశారు. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ సభ్యులు షబ్బీర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సభ వేడెక్కింది. దీంతో, మండలి ఛైర్మన్ కల్పించుకుని టీఆర్ఎస్ సభ్యులను సముదాయించి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.