: అసెంబ్లీలో టీడీపీ ఫైర్ బ్రాండ్...టీఆర్ఎస్ సర్కారు శాశ్వతం కాదని పోలీసులకు హెచ్చరిక
టీ టీడీపీ యువనేత, ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత రేవంత్ రెడ్డి నేటి ఉదయం అసెంబ్లీకి వచ్చారు. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయన నెలకు పైగా జైల్లో ఉండి వచ్చారు. మొన్నటిదాకా బెయిల్ ఆంక్షలతో తన సొంత నియోజకవర్గం కొడంగల్ కే పరిమితమైన ఆయన హైకోర్టు ఆంక్షలు సడలించిన నేపథ్యంలో హైదరాబాదులో ఇటీవలే అడుగుపెట్టారు. ఆ మరుక్షణమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై నిప్పులు చెరిగిన ఆయన నేటి అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. గడచిన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన ఆయన పెను కలకలమే రేపారు. తాజాగా నేటి సమావేశాలకు ఆయన రావడంతో మీడియా మొత్తం ఆయనపైనే దృష్టి పెట్టింది. నేటి సమావేశాలు ప్రారంభం కావడానికి కాస్తంత ముందుగానే అసెంబ్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ మునుపటిలాగే ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపైనే కాక కేసీఆర్ పైనా మరోమారు నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల వైఖరిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సర్కారు శాశ్వతం కాదని, పోలీసులు వారి విధులు వారు నిర్వహిస్తే మంచిదని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు.