: బాలుడి ప్రాణాలు తీసిన పతంగి మాంజా!


ఒక రెస్టారెంట్ లో భోజనం చేసేందుకు తన తండ్రితో పాటు మోటార్ బైక్ పై వెళ్తుండగా బాలుడి మెడను పతంగి మాంజా కోసేయడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ దారుణ సంఘటన చెన్నైలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... పెరంబూరులోని సేమతమ్మన్ కాలనీకి చెందిన ఎం.అప్పు, తన ఐదేళ్ల కొడుకు అజయ్ తో కలిసి ఒక రెస్టారెంట్ లో లంచ్ చేసేందుకని నిన్న మధ్యాహ్నం మోటార్ బైక్ పై వెళుతున్నారు. బైక్ పెట్రోల్ ట్యాంక్ పై భాగంలో అజయ్ కూర్చున్నాడు. మోటార్ బైక్ పెరంబూర్ ఫ్లై ఓవర్ వద్దకు సమీపించగానే అజయ్ మెడను ఎక్కడి నుంచో ఎగురుతూ వస్తున్న గ్లాస్ కోటెడ్ పతంగి మాంజా కోసివేసింది. దీంతో విపరీతంగా రక్తస్రావం జరిగి అజయ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. బాలుడి తండ్రి, అక్కడ ఉన్న వాహనదారులు బాలుడిని ఆసుపత్రికి తరలించేలోపే ఈ సంఘటన జరిగిపోయింది. సెంబియం పోలీసులు బాలుడి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మంగళాపురం కాలనీలోని చంద్రయోగి సమాధి రోడ్డు వద్ద ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గాలిపటాలు ఎగురవేసేందుకు ఉపయోగించే మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ ఏకంగిపురం, మంగళాపురం, థిక్కాకుళాం కు చెందిన స్థానికులు, యువత దీనిని ఉపయోగిస్తున్నారంటూ సామాజిక కార్యకర్త జమాలియా ఆరోపించారు. దీనిని వాడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News