: 4 శాతం తగ్గిన టికెట్ బుకింగ్స్... ఆందోళనలో భారతీయ రైల్వేస్
సామాన్యుని ప్రధాన రవాణా సౌకర్యంగా ఉన్న రైళ్లలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య తగ్గిందా? ప్రస్తుత గణాంకాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. గత సంవత్సరం ఏప్రిల్ - ఆగస్టుతో పోలిస్తే రైళ్లలో ప్రయాణించిన వారి సంఖ్య ఈయేడు గణనీయంగా తగ్గింది. 2014 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ 357.53 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య 4.12 శాతం తగ్గి 342.78 కోట్లకు పరిమితం కావడం భారతీయ రైల్వేల్లో ఆందోళను పెంచుతోంది. ఇదే సమయంలో రైల్వేల ఆదాయం 4.95 శాతం తగ్గి రూ. 20,204 కోట్ల నుంచి రూ. 19,394 కోట్లకు తగ్గింది. ఈ పండగ సీజనులో మాత్రం గత సంవత్సరంతో పోలిస్తే అధిక సంఖ్యలో ప్రజలు రైళ్లలో ప్రయాణాలు పెట్టుకుంటారని భావిస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, పాసింజర్ లకు మరిన్ని రాయితీలను ప్రకటించడం ద్వారా ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవాలని రైల్వే శాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది.