: దార్శనికుడైన మోదీకి మా విన్నపం ఇదే: సిలికాన్ వ్యాలీ ప్రముఖులు
ప్రధాని మోదీపై సిలికాన్ వ్యాలీ ప్రశంసల జల్లు కురిపించింది. ఈ ఉదయం ఆయనతో సమావేశమైన టెక్ దిగ్గజాల ప్రతినిధులు, మోదీ దార్శనికత, ముందుచూపులను కొనియాడారు. మోదీ స్వప్నమైన డిజిటల్ ఇండియా సాకారానికి తామంతా సహకరిస్తామని, అయితే, ఇండియాలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అడోబ్ కంపెనీల ప్రతినిధులు తమ ప్రసంగంలో భాగంగా ఏదో ఓక సమయంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. త్వరితగతిన అనుమతులు, పన్ను ప్రోత్సాహకాలు ఉంటే మరిన్ని కంపెనీలు పెట్టుబడులతో దేశానికి వస్తాయని వారు సూచించారు. మోదీ పర్యటన చారిత్రాత్మకమైనదని వ్యాఖ్యానించిన అడోబ్ సీఈఓ శంతన్ నారాయణన్, మోదీ అద్భుతమైన రాయబారి అని ప్రశంసించారు. ఆయన అంతర్జాతీయ దార్శనికుడని సిస్కో సీఈఓ జాన్, మోదీ డిజిటల్ ఇండియా కార్యక్రమం ఐటీ కంపెనీలకు ప్రేరణగా నిలిచిందని క్వాల్ కామ్ సీఈఓ పాల్ జాకబ్స్ వ్యాఖ్యానించారు. నూతన ఆవిష్కరణలకు ఇండియాను వేదికగా నిలపడంలో మోదీ ముందున్నారని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కితాబిచ్చారు. మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ టెక్ భవిష్యత్ కు ఇండియా కీలకం కానుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు.