: టెక్ చీఫ్ లతో మోదీ ఏమన్నారంటే..!
ప్రపంచంలో చివరిగా సూర్యాస్తమయాన్ని చూసే సిలికాన్ వ్యాలీలో నిత్యమూ ఎన్నో కొత్త ఆలోచనలు, ప్రొడక్టులు ఉదయిస్తూ, మానవాళికి ఉపయోగపడుతున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఐటీ కంపెనీల చీఫ్ లు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, పాల్ జాకబ్స్, టిం కుక్ తదితరుల ప్రసంగాల తరువాత మోదీ మాట్లాడారు. డిజిటల్ ఎకానమీలో భారత్, అమెరికాల భాగస్వామ్యం మరింతగా పెరుగుతుందని చెప్పడానికి ఈ వేదికే నిదర్శనమని అన్నారు. తాను ఢిల్లీలో ఉన్నా నిత్యమూ ఈ సమావేశానికి హాజరైన వారిని కలుస్తూనే వున్నానని వెల్లడించిన ఆయన, అందుకు సామాజిక మాధ్యమాలు ఎంతో సహకరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. తాను నిత్యమూ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ తదితరాల సాయంతో ఇక్కడున్న వారిలో అత్యధికులకు నిత్యమూ దగ్గరగానే వున్నానని మోదీ వివరించారు. పిల్లలకు విద్యను అందించే విషయంలో ఉపాధ్యాయులు, కుటుంబ పెద్దలకు పెద్దగా పనిలేకుండా పోయిందని, అందుకు గూగుల్ కారణమని మోదీ వ్యాఖ్యానిస్తే, సమావేశం ప్రాంగణం చప్పట్లు, నవ్వులతో నిండిపోయింది. మొబైల్ టెక్నాలజీ ప్రవేశంతో కొత్త శకం మొదలైందని అభిప్రాయపడ్డ మోదీ, డిజిటల్ ఇండియా కల సాకారానికి ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతున్నట్టు తెలిపారు. ఈ కొత్త శకంలో సామాజిక మాధ్యమాలే ఇరుగు, పొరుగుగా మారిపోయాయని ఆయన అభివర్ణించారు. గత కొద్ది నెలలుగా 170కి పైగా అప్లికేషన్లను వాడటం ద్వారా పరిపాలనలో పెను మార్పులు వచ్చాయని వివరించారు. తాము అధికారంలోకి రాగానే సెల్ ఫోన్లు, టెక్నాలజీతో పేదరికంపై యుద్ధం ప్రకటించామని మోదీ తెలిపారు.