: వేలమంది ఎన్నారైల 'దీపావళి' కోరికను తీర్చాలని ఒబామాకు మోదీ లేఖ!
ఎంతో కాలంగా అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు కోరుతున్నట్టుగా దీపావళి పండగపై ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేయాలని కోరుతూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాయనున్నారు. ప్రపంచంలోని అన్ని ప్రముఖ మతాల వేడుకల సందర్భంగా పోస్టల్ స్టాంపులను విడుదల చేయడం అమెరికన్ పోస్టల్ విభాగం ఆనవాయతీగా ఉండగా, ఇంతవరకూ దీపావళి స్టాంపులు మాత్రం విడుదల కాలేదు. పది సంవత్సరాలుగా 'దీపావళి స్టాంపు ప్రాజెక్టు' పేరిట ప్రతియేటా వేలమంది ఇండియన్ అమెరికన్స్ ప్రత్యేక స్టాంపుల కోసం అమెరికా ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నారు. అయితే, పోస్టల్ సర్వీస్ మాత్రం ఈ దిశగా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత అమెరికా పర్యటనలో భాగంగా, ఐరాస సాధారణ సభలో మోదీ మాట్లాడిన అనంతరం కొందరు ఎన్నారైలు ఆయనను కలిసి ఇదే విషయమై చర్చించారు. దీంతో తాను ఒబామాకు దీపావళి స్టాంపుల విషయమై లేఖ రాస్తానని మోదీ హామీ ఇచ్చినట్టు తెలిసింది. కాగా, వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు జరుపుకున్న తొలి అధ్యక్షుడిగా ఒబామా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే!